అవకాశాలకు ఆకాశమే హద్దు : వందేమాతరం ఫౌండేషన్‌

అవకాశాలకు ఆకాశమే హద్దు: సందర్భం

దాదాపు 13 వందల మంది పిల్లలను గ్రామాల నుండి తీసుకువచ్చి భోజన, వసతి సౌకర్యాలు కల్పించి 50 రోజులపాటు శిబిరం నడపడం, జాతిపట్ల అక్షరవనం సంస్థకు ఉన్న ఆదుర్దాను వెలిబుచ్చడం అభినందనీయం.

ఉన్నత విద్య కేవలం ఉద్యోగం కోసమే కాదు. మనిషిలో దాగి ఉన్న పరిమళాన్ని ప్రపంచానికి చాటడా నికి ఒక మాధ్యమం మాత్రమే. ప్రతి మనిషిలో ప్రతిభ దాగి ఉంటుంది. నిద్రాణంగా ఉన్న ఆ ప్రతిభను సమాజపరం చేయడానికి ఉన్నత విద్య ఒక మాధ్యమం. సమాజం అందరికీ సమానమైన అవకాశం కల్పించాలి. ఎవరికి ప్రతిభ ఎందులో దాగి ఉంటుందో తెలియదు. బుర్రకో బుద్ధి జిహ్వకో రుచి అన్న చందంగా సమాజం అన్ని అభిరుచులకు అది బఫే భోజనం. ఎవరికి ఎందులో ఆసక్తి, అభిరుచి ఉంటాయో వారి వారి అభిరుచుల మేరకు ఆయా రుచులతో కూడిన పదా ర్థాలను అందుకుంటారు. సమాజం సకల అభిరుచుల సమ్మేళనం. అభిరుచులను అందుకోవడం కష్టం. అవకా శాలు కల్పిస్తే ఆశయాలు మొగ్గ తొడుగుతాయి. వాటికి పదును పెడితే అపారమైన ప్రతిభ వెలికివచ్చి ప్రపంచానికి సంపదను సృష్టించి సమాజ అవసరాలను తీరు స్తాయి.

ప్రతిభావంతమైన జాతి నిర్మాణానికి వందేమాతరం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తిలో అక్షరవనం అనే వేదికను ఏర్పాటు చేసింది. అపారమైన మానవ సంపదగల ఈ జిల్లాలో విద్యార్థుల లోని అంతర్లీనంగా ఉన్న ఆసక్తులను వెలికితీసేందుకు వేసవి శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ఇది ఒక బఫేలాగా విద్యార్థులు వాడుకుంటున్నారు. ఇక్కడ తినుబండా రాలు కావు మైండ్‌కు కావలసిన బండారాలను వందేమాతరం ఏర్పాటు చేసింది. ఈ శిబిరాన్ని సంద  ర్శించినప్పుడు నేను అపారమైన నాట్య, వాద్య, గాత్ర, సాహిత్య, జానపద, చిత్ర, జ్ఞాన, గణిత కళలలో అబ్బో ఒకటేమిటి 14 రంగాలలో ప్రతిభా పాటవాలను వెలికి తీస్తున్నారు. ఒక గదికి వెళితే తబలా వాయించడం, మరో గదికి వెళితే డప్పు కొట్టడం, మరో గదిలో భరతనాట్యం చేయించడం, మరో చోట పల్లెపాటలు, నాట్లు వేసేటప్పుడు పాడే పాటలు ఈ విధంగా ఆట పాటలను మాటలతో కలిపి చిన్నపిల్లలో దాగి ఉన్నటు వంటి ప్రతిభను గిచ్చి లేపుతున్నారు. మనిషిని గిచ్చితే తెలవకుండానే తొడ జాడిస్తాడు.

అదే విధంగా 13 వందల మంది పిల్లలను గ్రామాల నుండి తీసుకువచ్చి భోజన, వసతి సౌకర్యాలు కల్పించి 50 రోజులపాటు శిబిరం నడపడం, జాతిపట్ల ఆ సంస్థకు ఉన్న ఆదుర్దాను వెలిబుచ్చడం అభినంద నీయం. దీనికి చేయూతనిస్తున్న ఆ జిల్లా కలెక్టర్‌ మాతృ హృదయాన్ని చాటుతుంది. పిల్లల కోసం అమ్మవలె ఆరాటపడిన తీరు జిల్లా కలెక్టర్‌ ముఖంలో కనబడింది. జిల్లా వ్యాప్తంగా ఆమె చొరవ తీసుకొని 2000 మంది పిల్లలకు తల్లిగా మారి శిబిరాల నిర్వహణకు ఆరాట పడుతున్న తీరు నన్నెంతగానో కదిలించింది. అక్షర వనానికి స్థలాన్ని విరాళమిచ్చిన ఫౌండేషన్‌ కార్యదర్శి మాధవ్‌ ముఖంలో జీవితం సార్థకమైనదన్న సంతృప్తి కనిపించింది.

వెలికి వస్తున్న పిల్లల ప్రతిభను చూసి ఎంతో ఆనందంతో మాధవ్‌ మాట్లాడుతూ నాట్యం చేస్తాడు. నిన్నటి వరకు బెంగళూరు నుంచి కూలీలను తీసుకు పోవడానికి యజమానులు మహబూబ్‌నగర్‌ జిల్లాకు వచ్చేవారు. కానీ ఈరోజు అదే యజమానులు విజ్ఞాన సంస్థలను సందర్శించడానికి మహబూబ్‌నగర్‌కు వస్తు న్నారు. ఆ మార్పుకు కారణమైన వాటిలో మా మాధవ రెడ్డి పాత్ర ఉంది అంటే అది అతిశయోక్తి కాదేమో. ఇది కేవలం ఆటే కదా అనుకున్నాను. బహుశా నాలో దాగి ఉన్న జిజ్ఞాసను గిల గిల పెట్టించడానికి ఒక గదిలోకి తీసుకెళ్లారు. తాతా గణితం నువ్వే చెప్పగల్గుతావని అను కున్నావు కదా! కానీ నేను కూడా చెప్పగలనని పదేళ్ల పిల్లవాడు లిటిల్‌ టీచర్‌లా నా ముందుకొచ్చి గణితంలో ప్రాథమిక సూత్రాలు గబగబా చెబుతుంటే, సున్నాను కనుక్కున్న వారెవరో కానీ ఆ చిన్నారి మాత్రం ప్రస్ఫు టంగా బాల గణిత మేధావిగా కనిపించాడు.

మనిషిలోని మనసుతో అభీష్టాన్ని బయటకు లాగడానికి వీరు వేసవి సెలవులలో క్యాంపులను నడిపిస్తారు. కొందరికి టెక్నాలజీ, సైన్స్‌ మీద అభిలాష, మరికొందరికి తను చేసే వృత్తిపై అభిరుచి, పిల్లల ప్రవృత్తికి తల్లిదండ్రులు అవకాశాలను సమకూరుస్తారు. అమెరికాలోని సిన్సినాటీలో నా స్వంత మనవడు న్యూరో సర్జన్‌గా పనిచేస్తున్నాడు. వాడు 9వ తరగతిలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు వాడి ఆసక్తిని గమనించి హాస్పిటల్‌కు తీసుకెళ్లి అక్కడ రోగులకు మందులు సర ఫరా చేయడం అలవాటు చేశారు. నా కూతురు, అల్లుడితో ‘ఇదేనా మీరు నేర్పించింది’ అన్నాను. అప్పుడు వారు ‘మీకు కనబడింది ఇంతే’ అన్నారు. ‘దాని వెనుక రోగిపట్ల సంరక్షణ, వాత్సల్యత వృద్ధి చెంది, వైద్యం పట్ల పెరిగిన నిబద్ధత వాడి మొహంలో కనబడట్లేదా’ అన్నారు. ‘ఇదే ప్రాక్టికల్‌ లెర్నింగ్‌’ అన్నారు. వేసవిలో ఆ పిల్లవాడు ఇండియాకు వచ్చాడు. తాత, అమ్మమ్మలకు మనవడు కాబట్టి చిట్టి పంజరంలో చిలుకను పెంచినట్లు పెంచేద్దాం అనుకున్నాం. కానీ వాడు ఇంట్లో ఉంటే కదా..! రెక్కలు వచ్చిన పక్షిలా, మా బంధువుకు ఆపరేషన్‌ అవుతుంటే థియేటర్‌లో ప్రత్య క్షంగా చూడడానికి వెళ్లాడు.

ప్రతి పిల్లవాడు చిన్నప్పటి నుండే కలలు కంటాడు. అమ్మ, నాన్నలుగా వారికి అవకాశాలు కల్పించాలి. ఇలాంటి అవకాశాలకు అక్షరవనం ఒక వేదిక అయింది. చదువు చెప్పడం కంటే నేర్చుకోవడం ఎలాగో నేర్పించే ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది. తనకు తానుగా ఆసక్తితో తన చుట్టూ ఉన్న అవకాశాలను అంది పుచ్చుకుని ఆశయాలను మెరుగు పరచుకుంటున్న తీరు ఆసక్తికరంగా ఉంది. పాఠశాల స్థాయిలో పిల్లల్ని పట్టు కొని పాఠాలు చెప్పడం పరిపాటి. నేర్చుకోవడం ఎలాగో నేర్చుకున్న ఇక్కడి విద్యార్థులకు ఉపాధ్యాయుల వద్ద పాఠాలు ఎలా నేర్చుకోవాలో అర్థమైంది. ఇది తెలియక సందేహాలను నివృత్తి చేసుకోలేక చదువులో వెనుకబడు తున్నారు. పాలమూరు జిల్లాకు అక్షరవనం ఒక విద్యా వర ప్రదాయిని. ఈ పరిశోధన కేంద్రంలో జరుగుతున్న ప్రయత్నం రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో విస్తరించాలి. పిల్లల్లో నిద్రాణంగా ఉన్న జ్ఞాన కిరణాలను తట్టి లేపాలి. తనకు ఏది కావాలో వెతుక్కునే అవకాశం ఇస్తే ఆకాశమే హద్దుగా పిల్లలు దూసుకుపోతారు.

వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త
శాసనమండలి మాజీ సభ్యులు


Source http://www.sakshi.com/news/vedika/huge-chances-to-be-success-347179
Post a Comment

Popular posts from this blog

40 Days Residential Summer Camp for Govt. School Students at Aksharavanam, Kalwakurthy, Mahabubnagar Dist

Vandemataram Foundation Pratibha Awards 2016

Remebering BhagatSingh, Rajguru, Sukhdev on Balidan Divas / Martyrs Day 23rd March