అక్షర వనం.. శిక్షణ సుమం :: వందేమాతరం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో

అక్షర వనం.. శిక్షణ సుమం 
వేసవి సెలవుల్లో విద్యార్థులను తీర్చిదిద్దిన శిబిరం 
చదువుతో పాటు భవితకు ఉపయుక్త అంశాల్లో తర్ఫీదు 

న్యూస్‌టుడే, కోనరావుపేట: స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వేసవి సెలవుల్లో అందించిన శిక్షణను విద్యార్థులు సద్వినియోగం చేసుకున్నారు. భావి జీవితంలో ఎలా నడుచుకోవాలో నేర్చుకున్నారు. పేద విద్యార్థులకు చేయూతనివ్వడానికి రుక్మిణీ గోవిందరావు(ఆర్జీ) ట్రస్టు, వందేమాతరం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వేసవి సెలవుల్లో సంయుక్తంగా ప్రత్యేక పరీక్ష నిర్వహించింది. ఎంపికైన విద్యార్థులకు భవిష్యత్తులో వివి పోటీ పరీక్షల్లో రాణించడం, వ్యక్తిత్వ వికాసం పెంపొందించుకోవడం, క్రమశిక్షణ అలవరచుకోవడం, సమస్యలు ఎదుర్కోవడంపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తిలో వేసవిలో 40 రోజుల పాటు నిర్వహించిన శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకున్న విద్యార్థులపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం..
40 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ తరగతులు
మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తిలో వందేమాతరం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ‘అక్షరవనం’ కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా పేద విద్యార్థులకు వేసవిలో 40 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. రాష్ట్రంలోని 10 జిల్లాల నుంచి ఎంపికైన సుమారు 600 మంది విద్యార్థులకు వివిధ విభాగాల్లో శిక్షణ ఇచ్చారు. పాఠశాల దశలోనే గణితం, ఆంగ్లం, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రంపై పట్టు సాధించడానికి మెలకువలు నేర్పించారు. విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసం పెంపొందించడానికి యోగా ఆసనాలు, నృత్యాలు, ఆటలు, పాటలు, కరాటేలో శిక్షణ ఇచ్చారు. మున్ముందు పోటీ పరీక్షలు సులువుగా సాధించడానికి మెథడ్స్‌ను, జీవితంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని పరిష్కరించేలా తీర్చిదిద్దారు. భవిష్యత్తులో ఉన్నత విద్య కొనసాగింపు, కోర్సుల ఎంపిక ఉద్యోగావకాశాలపై అవగాహన కల్పించారు. వేసవి శిక్షణ తరగతులను ఆ జిల్లా కలెక్టర్‌ శ్రీదేవి, ప్రముఖ విద్యావేత్తలు చుక్కా రామయ్య, ఘంట చక్రపాణి పర్యవేక్షించి పలు సలహాలు, సూచనలు చేశారు. విద్యార్థుల ప్రగతిని పరీక్షించారు.
పరీక్షలో కోనరావుపేట విద్యార్థుల ప్రతిభ
కల్వకుర్తిలోని అక్షరవనంలో నిర్వహించిన వేసవి శిక్షణ తరగతులకు 600 మంది విద్యార్థులు హాజరు కాగా కోనరావుపేట విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. అమెరికాకు చెందిన ఎస్‌ఆండ్‌పీ గ్లోబల్‌ అంతర్జాతీయ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ వారు నిర్వహించిన ప్రతిభ పరీక్షలో ముందు వరుసలో నిలిచారు. గుజరాత్‌, మహారాష్ట్రలోని విద్యా నిపుణులు ప్రభుత్వ పాఠశాలలోని 8, 9, 10 తరగతుల ఆధారంగా చేసుకుని పరీక్ష నిర్వహించారు. అందులో కోనరావుపేటకు చెందిన పదో తరగతి విద్యార్థులు శెట్టియార్‌ రాజు, జీవంతి, తొమ్మిదో తరగతి విద్యార్థులు సాయిజా, పూజిత, శ్యామ్‌ వందకు వంద మార్కులు సాధించి టాప్‌-5లో చోటు సంపాదించారు. హైదరాబాద్‌లోని ఎస్‌సీఈఆర్‌టీ వారు మే 25, 26 తేదీల్లో ప్రాథమిక విద్యపై పరీక్ష నిర్వహించగా ప్రతిభ కనబర్చారు. వీరికి నిర్వాహకులు రూ.1000 నగదు, బహుమతులు అందజేశారు.
పోటీ పరీక్షల్లో రాణిస్తానన్న నమ్మకం కలిగింది: డి.అఖిల, పదో తరగతి, ఆదర్శ పాఠశాల
అక్షరవనంలో వేసవి శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవడం సంతోషంగా ఉంది. మొదట గణితం, సామాన్యశాస్త్రం, ఆంగ్లంపై పట్టు సాధించేలా సులభ మెథడాలజీలను నేర్పించారు. భవిష్యత్తులో ఉన్నత విద్యను అభ్యసించి పోటీ పరీక్షల్లో రాణించగలననే నమ్మకం కలిగింది. జీవితంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా స్థిరపడటానికి ఇప్పటి నుంచే సాధన చేస్తాను.
జాతీయ కరాటే పోటీల్లో సత్తా చాటుతా: డి.కావ్య, పదో తరగతి, కోనరావుపేట
చిన్నప్పటి నుంచి నాకు కరాటే అంటే ఇష్టం. జూనియర్‌ విభాగంలో గతంలోనే బ్లాక్‌బెల్టు సాధించాను. అక్షర వనంలో అందించిన శిక్షణ తరగతుల్లో చాలా మెలకువలు నేర్చుకున్నాను. అందుకు తగిన విధంగా సాధన చేయడం నేర్పించారు. శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవడం సంతోషంగా ఉంది. భవిష్యత్తులో జాతీయ స్థాయి కరాటే పోటీల్లో రాణించగలననే నమ్మకం కలిగింది.
చదువుతో పాటు వ్యక్తిత్వ వికాసానికి దోహదం: పూజిత, పదో తరగతి, ఎల్లారెడ్డిపేట
శిక్షణ తరగతుల్లో చదువుతో పాటు వ్యక్తిత్వ వికాసం, క్రమశిక్షణ నేర్చుకున్నాం. భవిష్యత్తులో పోటీ పరీక్షల్లో రాణించేలా సన్నద్ధం చేశారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా పరిష్కరించుకునేలా అవగాహన కల్పించారు. మనం చేసే పని పట్ల అంకితభావం అలవర్చుకునేలా పలు సలహాలు, సూచనలు చేశారు. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు ప్రతి విద్యార్థి సద్వినియోగపర్చుకోవాలి.
వచ్చే ఏడాది మరింత మందికి శిక్షణ: గంగుల శ్రీనివాస్‌, ఆర్జీరావు ట్రస్టు సమన్వయకర్త
వేసవి శిక్షణ తరగతులకు ఆర్జీ రావు ట్రస్టు ద్వారా ఎంపిక చేసిన 600 మంది విద్యార్థుల్లో కోనరావుపేట, ఎల్లరెడ్డిపేట విద్యార్థులు ప్రతిభ కనబర్చడం సంతోషంగా ఉంది. వచ్చే ఏడాది మరింత మంది పేద విద్యార్థులను శిక్షణ తరగతులకు తరలించడానికి కృషి చేస్తాం.
Source: http://archives1.eenadu.net/06-13-2016/district/inner.aspx?dsname=Karimnagar&info=krn-sty3
Post a Comment

Popular posts from this blog

40 Days Residential Summer Camp for Govt. School Students at Aksharavanam, Kalwakurthy, Mahabubnagar Dist

Remebering BhagatSingh, Rajguru, Sukhdev on Balidan Divas / Martyrs Day 23rd March