అట్టడుగు వర్గాల పిల్లల్ని ఆదుకుంటున్న సంస్థ

గాలిలో దీపం పెట్టి అది వెలుగుతుందా? లేదా? అని చూడడం బాధ్యతాయుతమైన ప్రభుత్వ లక్షణాలు కావు. గాలికి ఆరిపోతుంటే ప్రజలు చూడలేక దీపం చుట్టూ ఇటుకలు పెడతారు. ఆ దీపాన్ని కాపాడుకుంటారు. అదే మాదిరిగా తెలంగాణలో ఏర్పడిన స్కూళ్ల పరిస్థితి పరువు అధ్వాన్నంగా ఉంది. తెలంగాణ పల్లెల్లో స్కూల్ తెరిచి దాన్ని నిర్వీర్యం చేస్తే చివరకు విద్యావాలంటీర్లతో చదువు నడిపిస్తూ ఉన్నారు. కొద్దో గొప్పో ఆర్థికంగా నిలదొక్కుకున్న వారు తమ పిల్లలను పట్టణాలకు పంపుతున్నారు. చివరకు ఈ గ్రామాల బళ్లల్లో మిగిలింది దళిత, గిరిజన, బహుజన వర్గాలు, సబ్బండ వర్ణాల పిల్లలు మిగిలారు. బడికిపోతే చాలు అనే అమాయకుల పిల్లలు వాళ్లంతా. గత పది సంవత్సరాలనుంచి స్కూళ్లను చూపించి కొందరు భుజాలెగరేసుకుంటున్నారు. కానీ ప్రజలు మాత్రం విద్యా ప్రమాణాలు ఆ బళ్లలో లేక కొత్త ముద్రలు వేయించుకున్నారు. ఈ వర్గాలకు చదువు రాదని కొంతమంది అంటున్న మాటలు వినలేక ఈ పల్లెటూళ్లలోనే సర్కారీ స్కూళ్లలో చదువుకున్నవారు ఎంతోమంది ఇతర దేశాలకు పోయి కొన్ని కాసులు సంపాదించుకుని తమ తమ్ముళ్లను ఆదుకునేందుకై కొన్ని సంస్థలను ఏర్పాటు చేస్తున్నారు. దానిలో ‘వందేమాతరం’ లాంటి సంస్థ ఒకటి. గత 10 సంవత్సరాలనుంచి ఇక్కడ పరిస్థితుల్ని గమనించి ప్రభుత్వ స్కూళ్లల్లో చదువుతున్నటువంటి కొంతమంది పిల్లలను పదవ తరగతి పరీక్షలకన్నా రెండు నెలల ముందే వారిని తీసుకుపోయి ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు. వీళ్లకోసం ప్రత్యేక అధ్యయన శిబిరం ఏర్పాటు చేశారు. వందేమాతరం సంస్థ ఈ కృషి నిరాటంకంగా కొనసాగించడం ఆనందించవలసింది. ఈ ఏడాది కూడా వరంగల్ జిల్లా తొర్రూర్‌లో అలాంటి అధ్యయన శిబిరమే ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమందికి ఇది చిన్న విషయంగానే కనపడవచ్చును. కానీ వారు చేస్తున్న పనిమాత్రం ఆదర్శనీయమైనది. తెలంగాణ గ్రామాల్లో చదివే విద్యార్థులకు రెండు పూటలా అన్నం దొరికే భద్రత లేదు. కాబట్టే ఈ బాధననుభవించి కనీసం పరీక్షలకన్నా ముందు పిల్లలకు ఆ అభద్రతాభావం ఉండకూడదని భోజన వసతి కల్పించారు. అది పుష్టికరమైన ఆహారం అయితేనే పరీక్షల సమయంలో ఏకాగ్రత ఉంటుందని ఈ సంస్థ పిల్లలకు పౌష్టికాహారం అందించే పనిని కూడా చేపట్టింది.
పదవ తరగతి పరీక్ష ఇచ్చే పిల్లల వయసు 15 నుంచి 16 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఆ పిల్లల ప్రవర్తన క్లాసులో ఒక రకంగా ఉంటుంది. తరగతి గదిలో వెలుపల ఒంటరిగా కలిస్తే మరో రకంగా ఉంటుంది. పదిమందిలో తనను ఎవరైనా విమర్శిస్తే భరించలేడు. ఒంటరిగా కలిస్తే విధేయత చూపిస్తాడు. చాలా తొందరగా ఇతరుల త్యాగంతో కదిలిపోతాడు. మానవీయమైన లక్షణాలు ఎక్కువగా ఆకర్షిస్తాయి. కాబట్టే ఈ పిల్లలకు వివేకానందుడు, తమకోసం కష్టపడి చదువుచెప్పే టీచర్ అన్నా ఎంతో విధేయత చూపుతాడు. కానీ స్నేహితులంటే ప్రాణమిస్తాడు. ఈ లక్షణాలు గమనించి మూడు నాలుగొందల మందిని ఒక శిబిరంలో ఉంచడం వారికి ఒక క్రమశిక్షణ కలిగించడం అంత సులభమైన పని కాదు. దాని నిర్వాహకులు ఎంతో త్యాగధనులుగా కనపడితేనే ఒంగుతారు. అదే జరుగుతున్నది. తను నేర్చుకోని విషయాన్ని తోటి పిల్లలకు చెప్పుకుంటారు. ఆ పిల్లలు చెబుతుంటే ఎంతో శ్రద్ధగా వింటారు. ఉపాధ్యాయుడు సాధించలేని ఈ ప్రగతిని తోటి విద్యార్థులు సాధిస్తున్నారు. ఈ శిబిరంలో సహచరలే తన తోటి పిల్లలకు చదువుచెప్పడం ఇదొక అపూర్వమైన విషయం. దీనివలన చెప్పే వారికి కూడా సబ్జెక్టుపైన కమాండ్ వస్తున్నది. గంధం తీసిన కొద్దీ సువాసన వస్తూ ఉంటుంది. అదే మాదిరిగా ఇతరులకు ప్రాధమికమైన మూలాలు చెప్పినప్పుడు చెప్పేవానికి స్పష్టత ఏర్పడుతుంది. ఈ స్పష్టతతో ఆ విద్యార్థి పరీక్షలో కూడా తన తోటి పిల్లలకు ఎలా చెప్పాడో అదే మాదిరిగా ఎగ్జామినర్‌కు కూడా చెబుతాడు. అదే అతని ఎదుగుదలకు కారణమవుతున్నది. సబ్జెక్టే వారి మధ్య బాంధవ్యాన్ని గట్టిపరుస్తుంది. మగపిల్లలు ఆడ పిల్లలతో అన్నా అని పిలుచుకుంటూ తిరుగుతుంటే నాకెంతో ముచ్చటగా అనిపించింది. మనం రాత్రింబవళ్లు మార్కెట్ కల్చర్‌ను వారి ముందు చూపిస్తే ఆడపిల్లల కళ్లల్లో యాసిడ్ పోస్తారు. అదే ఈ శిబిరంలో అన్నా చెల్లెళ్ల బాంధవ్యాన్ని నూరిపోస్తున్నారు. పిల్లల మధ్య సంబంధాలను మానవీయ సంబంధాలు పెరగడం చూశాక ఆ పిల్లల మీద గౌరవం పెరిగింది. పిల్లల్లో ఏం తప్పులేదు, పెద్దల నడవడిక పెద్దల ప్రవర్తననుబట్టే వారు మారుతారు. ఇది వ్యాపార సమాజం. సమస్యలనుంచి పిల్లల దృష్టిని మరల్చి అటు తాగుడుకో, మరే ఇతర దురలవాట్ల వైపుకో దృష్టి మళ్లిస్తారు. లైంగిక ఉద్రేకాలను పిల్లల్లో రెచ్చగొట్టే వ్యాపార సంస్కృతి నరనరాన ఎక్కించే దుష్టసంస్కృతి ఇక్కడ రాజ్యమేలుతోంది. ఇదొక దౌర్భాగ్యం. వ్యాపార సంస్కృతిని ఫ్రజల జీవిత సమస్యలను మూలాలకు సంబంధించిన కీలక అంశాలను మరిపించే పని చేస్తుంది. మార్కెట్‌కు మనుషులక్కర్లేదు. మానవీయ కోణాలు అసలక్కర్లేదు.
అవకాశం దొరికినప్పుడల్లా సర్కారీ స్కూళ్లను లేక సర్కారీ టీచర్లను అప్రతిష్టపాలు చేసే సంస్కృతిని అభివృద్ధి చేశారు. చెడు అన్ని దేశాల్లో ఉంటుంది. మంచి అన్ని దేశాల్లో ఉన్నది. కొందరు సర్కారీ స్కూళ్లలో ఉండే మంచికి ప్రాచుర్యం ఇచ్చి చెడును తొలగించుటకై చర్యలు తీసుకుంటారు. ఇది ఆ దేశం యొక్క రాజకీయ దృక్పథంపై ఆధారపడి ఉంటుంది. అదే మాదిరిగా ఈ వందేమాతరం వాళ్లు సర్కారీ స్కూళ్లపై ఏ మంత్రాన్ని ప్రయోగించారో తెలియదు. ఆ చుట్టుపక్కల ఉండే ప్రభుత్వ టీచర్లే ఐచ్ఛికంగా రావడం రాత్రింబవళ్లు ఈ పిల్లలతో కలిసి ఉండడం నన్ను ఆశ్చర్యపరిచాయి. వీరందరూ కూడా తొర్రూరు చుట్టుపక్కల నున్న టీచర్లు. దీనితో సహా ప్రతి విద్యార్థి ఆత్మవిశ్వాసంతో 500 పైచిలుకు మార్కులు తెచ్చుకుంటానని చెప్పి ఎస్‌ఎస్‌సి పాసయ్యారు. వారీనాడు వివిధ ఉన్నత విద్యారంగాల్లో, ట్రిపుల్ ఐఐటీల్లో చదువుతున్నారు. ఈ పిల్లల్ని కొందరు కార్పొరేట్ సంస్థలు తీసుకుపోతున్నారు. స్కూళ్లు పెట్టి అవి ఎలా వెలుగుతాయో చూశాం కానీ దానికి కావాల్సిన చుట్టుపక్కల కట్టడాలను కట్టలేదు. పితృస్వామ్య వ్యవస్థ ఉండడంవలన సామాజిక కట్టడాలు రాలేదు. ఆర్థిక వనరులు లేవు. కాబట్టే ప్రభుత్వం పెట్టినటువంటి స్కూళ్లలో పిల్లలు అనాధగానే పెరగవలసి వస్తుంది. ఇది గుండె పిండేటట్లుగా ఉంది. ఈ లోపాన్ని తొలగించడానికై ఈ గ్రామాల్లో చదువుకుని, ఈ గ్రామాల్లో పుట్టి, ఇతర దేశాల్లో ఉద్యోగం చేస్తున్న యువకులే ముందుకు వచ్చారు. వీళ్లే ఈ కొత్త సామాజిక ఆర్థిక కట్టడాలను నిర్మిస్తున్నారు. ఇవి కొంతవరకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి. దీనికే మనం చిన్నప్పటినుంచి పునాదిని నిర్మించే సుశిక్షితులైన టీచర్లను అందిస్తే ఈ తెలంగాణ ప్రాంతం ఇలా ఉండేదా? కోళ్లకు నూకలు వేసినట్లు రెండు రూపాయల బియ్యం ఒక రూపాయి బియ్యమని, నిరుద్యోగులకు కాంట్రాక్టు ఉద్యోగాలని ఈ ప్రాంతాన్ని నిర్వీర్యం చేసిన దానికన్నా ఒక చక్కని విద్యా వ్యవస్థతో తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఎంత బాగుండునోనని ‘వందేమాతరం’ సంస్థ చేసిన ప్రయోగం ద్వారా తెలుస్తుంది.
వరంగల్‌లో ఉన్న ఈ స్కీమ్ విజయవంతం అయ్యాక మహబూబ్‌నగర్‌కు వెళ్లారు. జిల్లాలో 14 క్యాంప్‌లు పెట్టారు. దానిలో జడ్చర్ల, నాగర్‌కర్నూల్, కల్వకుర్తిలలోని 3 క్యాంప్‌లను చూశాను. ఇవన్నీ దాతలతో నడుస్తున్న శిబిరాలు. ఈ ప్రాంతంలో బడులు దాతలతోనే అభివృద్ధి కావాల్నా? ప్రజాస్వామిక హక్కులు స్వాతంత్య్ర ఫలితాల హక్కు వీరికి లేదా? అన్న అనుమానం వస్తూ ఉంది. ఈ ప్రాంతాన్ని వేధిస్తున్న ప్రశ్న ఇదే.

  • 31/03/2012
  • -చుక్కా రామయ్య -iitramaiah@gmail.com
Post a Comment

Popular posts from this blog

40 Days Residential Summer Camp for Govt. School Students at Aksharavanam, Kalwakurthy, Mahabubnagar Dist

Vandemataram Foundation Pratibha Awards 2016

Remebering BhagatSingh, Rajguru, Sukhdev on Balidan Divas / Martyrs Day 23rd March