ఈ నేలపై చైతన్యం కోసం.. వందేమాతరం

  • 03/03/2012
  • |
  • -చుక్కా రామయ్య
ఈనాడు ప్రభుత్వ స్కూళ్లలో 90 శాతంమంది పేదవర్గాల నుంచి వచ్చిన వారున్నారు. ఇందులో చాలామంది ఆడపిల్లలున్నారు. ఆంతా దళితులు, గిరిజనులే. ఒక శాతం కూడా ఉన్నత కులాల వారు ఈ ప్రభుత్వ బడులకు రావడమే లేదు. ధనవంతుల, ఉన్నత కులాల పిల్లలు పట్టణ నగర ప్రాంతాల్లో చదువుతున్నారు. ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లల తల్లిదండ్రులు చదువుకున్నవారేం కాదు. ఇంటిలో చదువుకునే వాతావరణమే లేదు. వీరి జీవన స్థాయిని గమనించి ‘వందేమాతరం’ అనే ఒక సంస్థ సర్కారీ స్కూళ్లలో చదువుకున్న విద్యార్థులను ఎన్నుకుని వీరికి తొర్రూరులో గత 10 సంవత్సరాలనుంచి ఒక శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. పరీక్షల ప్రిపరేషన్ వేరు, స్కూలింగ్ వేరు, చదువుకోవడం వేరు. పరీక్షల విధానం వేరే విధంగా ఉంటుంది. పరీక్షల కాలంలో విద్యార్థి మానసిక స్థితి ఎంత ప్రధానమో ఆరోగ్యం కూడా అంతే ప్రధానం. వారికై పుష్టికరమైన ఆహారం క్రమంగా ఏర్పాటు చేయడం అందుకు వందేమాతరం సంస్థ నిలబడడం ప్రశంసించతగింది. 500 మంది విద్యార్థులకు 45 రోజులు పుష్టికరమైన ఆహారాన్ని అన్ని వసతులతో సహా ఏర్పాటు చేయడం ఇదొక భాగమైతే, రెండవది పిల్లలను ఏ సబ్జెక్టులో బలహీనంగా ఉన్నారో కనుక్కుని వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఆసక్తిగల టీచర్లను ఆహ్వానించి వారితో పరీక్షలకు సంబంధించిన బోధన కొనసాగించడం మరో ముఖ్యమైన పని. ఈ 45 రోజులు 500 మంది విద్యార్థులు సామూహికంగా కలిసుండడం వలన, ఒకరికోసం అందరూ నిలబడాలన్న ఆలోచనను బలపడేవిధంగా చేస్తుంది. ఒక్కరికోసం అందరు, అందరికోసం ఒక్కరు పనిచేయడం, ఒక క్రమశిక్షణ జీవితాన్ని అలవాటు చేయడం ఈ శిబిరం లక్ష్యంగా కనిపిస్తుంది. విద్యార్థికి ఏ సబ్జెక్టులోనైనా బలహీనతలుంటే అది ఉపాధ్యాయునితో చెప్పించడం ఒక భాగమైతే తోటి విద్యార్థులతో అది చెప్పించడం ఉభయులకు లాభదాయకంగా కనిపిస్తుంది. గంధం తీసినకొద్దీ సువాసన ఎక్కువ వస్తుంది. ఇతరులకు చెప్పినకొద్దీ బోధించి చెప్పే విద్యార్థికి కూడా స్పష్టత ఏర్పడుతుంది. తోటి విద్యార్థి చెప్పడం వలన ఆ బలహీన విద్యార్థి కూడా తన అనుమానాలను స్పష్టంగా ధైర్యంగా అడిగే అవకాశం దొరుకుతుంది. దీనితో ప్రతిభగల విద్యార్థికి వెనుకబడిన విద్యార్థికి ఇద్దరికి కూడా అవినాభావ సంబంధం కూడా పెరుగుతుంది. సామూహిక జీవితంపైన విశ్వాసం పెరుగుతుంది.తల్లిదండ్రులు చదువుకున్నవారు కాకపోవడం వలన పట్టణాలలో చదువుకున్న మధ్యతరగతి తల్లిదండ్రులు ఏ గైడెన్స్ అయితే తమ పిల్లలకు ఇచ్చుకుంటున్నారో ఆ కొరతను తీర్చడానికై ఈ వందేమాతరం శిబిరంలో తోటి విద్యార్థులో లేక అంకిత స్వభావం గల ఉపాధ్యాయులో ముందుకు వచ్చి పిల్లలకు సహాయపడుతున్నారు. దారిద్య్రం వలన ఆర్థికంగా వెనుకబడి ఉన్న లొసుగులను ఈ విధంగా ఒకరికొకరు కలిసి పూడ్చుకుంటున్నారు. అదీ కాకుండా ఏ సర్కారీ స్కూల్ టీచర్లనైతే నిందిస్తున్నారో అదే సర్కారీ స్కూల్ టీచరు ఈ శిబిరంలో ఎక్కువ పనిగంటలు స్వచ్ఛందంగా పనిచేస్తున్న విషయం గుర్తుంచుకోవాలి. కార్పొరేట్ స్కూళ్లల్లో చేసే మాదిరిగా చిన్న చిన్న యూనిట్‌ల వారీగా పరీక్షలను నిర్వహించి విద్యార్థుల్లో బలహీనతలను సరిచేస్తున్నారు.
పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ఈ శిబిరం ఎంతో దోహదపడుతుంది. ఎక్కువ మార్కులు వచ్చిన పిల్లల గురించి ప్రశంసల వర్షం కురిపించిన దానికన్నా వెనుకబడిన విద్యార్థిలో ఒక అడుగు ముందుకు వేసేందుకు ప్రయత్నం చేస్తే అది గొప్పదవుతుంది. ఇలాంటి ప్రయత్నం గత 10 సంవత్సరాలనుంచి చేస్తున్నందుకు వందేమాతరానికి అభినందనలు. సర్కారీ స్కూళ్లలో పిల్లలకు 500 మార్కులకు మించి పొందే అవకాశాలను మరింతంగా పెంచేందుకు ఈ సంస్థ దోహదం చేస్తుంది. ఇక్కడనుంచి వచ్చిన విద్యార్థులు వాళ్లు సమర్ధవంతంగా ట్రిపుల్ ఐఐటిని పూర్తి చేసి రావడం ఆ ప్రాంత పేద విద్యార్థుల్లో ఎంతో విశ్వాసాన్ని పెంపొందించింది.
ఒక విద్యార్థి మాట్లాడుతూ మాకు రూపాయి కిలో బియ్యంకన్నా నాణ్యమైన చదువు చెప్పిస్తే మా తిండిని మేం సంపాదించుకుంటాం అదా అని అన్నాడు. మమ్మల్ని రూపాయి కిలోబియ్యం పథకంగా మార్చకుండా సమర్ధవంతమైన మానవ వనరుగా మార్చేందుకు కృషి చేయండని అంటున్నారు. ఇలాంటి ప్రయత్నం వందేమాతరం చేయడం ఆహ్వానించతగింది. ఒక స్వచ్ఛంద సంస్థ ఏ రకమైన ఆపేక్ష లేకుండా స్వచ్ఛందంగా కృషి చేయడం గొప్పది.
ఇందుకు అమెరికాలో ఉన్న ఎన్‌ఆర్‌ఐ అశోక్‌రెడ్డి ఈ సంస్థకు ఆర్థిక సాయం అందిస్తున్నాడు. నేను పుట్టిన గడ్డకు ఈ సాయం చేసి నా రుణం తీర్చుకుంటున్నానని అన్నాడు. ఎవరో వచ్చి సాయం చేస్తారని ఎదురు చూసేకన్నా ఈ గడ్డలో పుట్టిననవాడే ఆ పేద పిల్లలకు సాయం చేసేందుకు నిలబడడం గొప్ప విషయం.చదువుకోవాలనే శ్రద్ధగల విద్యార్థులు ముందుకు వస్తున్నారు. నా నేలలో పుట్టి పెరిగి ఎదిగి ఎక్కడో దూర దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు దాతలుగా వస్తున్నారు. నాలాంటి వారికి నిరాశపడకండన్న సందేశాన్ని ఆ విద్యాశిబిరం అందిస్తున్నది.

Source: Andhra Bhoomi
Post a Comment

Popular posts from this blog

40 Days Residential Summer Camp for Govt. School Students at Aksharavanam, Kalwakurthy, Mahabubnagar Dist

Remebering BhagatSingh, Rajguru, Sukhdev on Balidan Divas / Martyrs Day 23rd March