vandemataram foundation in Andhrajyothy newspaper telugu font వందేమాతరం మనబడి..మన ఊరు..మన దేశం

వందేమాతరం మనబడి..మన ఊరు..మన దేశం

Source: Andhrajyothy

వందేమాతరం..భరతజాతి యావత్తునూ ఒక్క తాటిపైకి తెచ్చిన నినాదం. తెల్లదొరలకు చుక్కలు చూపించిన నినాదం. నాటి స్ఫూర్తి నేడు కరుయ్యింది. ఇది ఇలాగే కొనసాగుతూ పోతే మూడు రంగుల జెండా రెపరెపల వెనకున్న మహనీయుల కృషి శాశ్వతంగా కనుమరుగవుతుంది.

ఆనాడు పెల్లుబికిన దేశభక్తిని ప్రతి ఒక్కరిలో మళ్లీ తీసుకురావాలని నడుం కట్టింది వందేమాతరం ఫౌండేషన్. విద్యార్థుల్లో దేశభక్తిని రగిలిస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించే ఏర్పాట్లు చేస్తోంది. వారి భావిజీవితానికి భరోసా ఇస్తూ, సమ సమాజ నిర్మాణానికి జవసత్వాలున్న నూతన తరాన్ని అందించడానికి కృషిచేస్తోంది.

navya. విద్య..దేశప్రగతికి ముఖ్య వనరు. అదొక్కటి లేనప్పుడు ఎన్ని ఉన్నా మనిషికి రావాల్సినంత గుర్తింపు రాదు. విద్య ప్రపంచంలో దేన్నైనా అందుకునేలా చేస్తుంది. కానీ ఇప్పుడు ఈ నాణ్యమైన ఉన్నత విద్య కార్పొరేట్ కాలేజీల్లో బంధీ అయింది. ప్రభుత్వ పాఠశాలలు మొక్కు'బడు'లయ్యాయి. దీంతో చదువుకోవాలని ఉండీ చదువుకోలేని విద్యార్థులకు విద్య అందని ద్రాక్షే అయింది.

ఈ పరిస్థితికి ఇంతటితో చరమ గీతం పాడాలని నిశ్చయించుకుంది వందేమాతరం ఫౌండేషన్. సర్కారీ బడుల్లోని మాణిక్యాలను బయటకు తీసి సానబెట్టాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడవుగా తమ ఆలోచనను ఆచరణలోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం వందేమాతరం కృషితో ఎందరో విద్యార్థులు ప్రతిష్ఠాత్మకమైన ఐఐఐటీల్లో చదువుకుంటున్నారు. మరెందరో వైద్య విద్య అభ్యసిస్తున్నారు. వీరంతా కడు నిరుపేదలు కావడం మరో గమనార్హ ం.

ఆవిర్భావం...
ఈ ఫౌండేషన్ స్థాపన వెనుక ఎంతో శ్రమ ఉందంటారు రవీందర్. వరంగల్ జిల్లా వర్థన్నపేటలోని ఇల్లందు రవీందర్ స్వగ్రామం. స్వతహాగా పాత్రికేయుడైన రవీందర్‌కు ప్రతీరోజు కళ్లముందు కనిపించే అవినీతి కుదురుగా ఉండనీయలేదు. తన వృత్తికి అడుగడుగునా అడ్డుతగులుతున్న అవినీతిని సమూలంగా పెకిలించాలనే ఆలోచన వచ్చింది.

అంతే.. చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశారు. అయితే ఉద్యోగాన్ని వదిలిన తరువాత గానీ తెలిసిరాలేదు, సమాజంలో అడుగడుగునా వేళ్లూనుకొని ఉన్న అవినీతిని అంతమొందించడం తన ఒక్కడి వల్ల అయ్యేపనికాదని. మరేం చెయ్యాలి? ఎన్నో రోజుల మథనం తర్వాత వచ్చిన ఆలోచనే 'వందేమాతరం ఫౌండేషన్'కు నాంది పలికింది. "సమాజంలో అక్షరాస్యత పెరగాలి. అక్షరాస్యత పెరగడం వల్ల ప్రశ్నించే గుణం పెరుగుతుంది.

అప్పుడే అవినీతికి అడ్డుకట్ట వేయగలం. అయితే దీనికి దేశభక్తి తోడవ్వాలి. మన మూలాలు తెలుసుకుంటే మనం కూడా అదే బాటలో పయనిస్తాం. లేదంటే అస్తవ్యస్తమైన జీవితాలతో ఇలాగే గడిపేస్తాం. మూడుకోట్ల పదిహేను లక్షల మంది త్యాగాల ఫలితంగా వచ్చిన స్వేచ్ఛా వాయువులు కలుషితం అయిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోవడం భావ్యం కాదనే విషయాన్ని ప్రతీ ఒక్కరికి తెలియజేయాలి. దీనికి విద్యార్థులే సరైన వారు'' అన్న ఆలోచన వచ్చింది. ఇదే ఫౌండేషన్ స్థాపనకు దారితీసింది అంటారు రవీందర్.

నిబ్బరాన్ని నీరుగార్చినా..
చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకొని దేశ సేవచేస్తానంటూ వచ్చిన రవీందర్‌ను మొదట ఎవరూ హర్షించలేదు. తల్లిదండ్రులు సైతం పెదవి విరిచారు. ఇది తమకు ఇష్టం లేదంటూ ఖరాఖండిగా చెప్పేశారు. అప్పటి వరకు వెన్నంటి ఉన్న మిత్రులు సైతం రవీందర్ ఆలోచన సరైందికాదంటూ నిరుత్సాహానికి గురిచేశారు. దేశంలో ఎవరికీ పట్టని బాధ నీకెందుక న్నారు.

స్వతహాగా సున్నిత మనస్కుడైన రవీందర్‌కు అయిన వారందరూ బాసటగా నిలువకపోవడంతో కొంత నిరుత్సాహానికి గురయ్యారు. అయినా తన సంకల్పం గొప్పదైనప్పుడు అడ్డంకులన్నీ ఆవిరైపోతాయని మనసుకు సర్దిచెప్పుకున్నారు. ఆస్తిలో తనకు రావాల్సిన వాటాను నిక్కచ్చిగా తీసుకుని బయటకు వచ్చిన రవీందర్ 2005లో ఇల్లందులో వందేమాతరం ఫౌండేషన్‌ను స్థాపించారు. ఇప్పుడు ఈ సంస్థ సాధిస్తున్న విజయాలను చూస్తున్న వారంతా రవీందర్‌ను ఎంతగానో పొగుడుతుండడం విశేషం.

navya. ఏమేం చేస్తుంది?
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తోంది. పదో తరగతిలో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఉన్నత చదువులు అందించడం కోసం దాతలను సమకూరుస్తుంది. వేలమంది బడీడు పిల్లల్ని గుర్తించి వారికి అక్షరాభ్యాసం చేయించి స్కూల్లో చేర్పించడంతో పాటు బడిమానేసిన పిల్లలను తిరిగి స్కూల్లో చేర్పించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థుల భవితకు బంగారు బాటలు పరుస్తోంది.

ఇంతేకాక విద్యార్థుల పైచదువులకు కావలసిన ఆర్థిక సహకారాన్నీ అందిస్తోంది. కిశోరీ విద్యావికాసం పేరుతో పదో తరగతితో చదువు ఆపేసిన ఆడపిల్లలను అక్కున చేర్చుకుని ఉన్నత చదువులు చదివించడానికి కావలసిన అన్ని ఏర్పాట్లను చేస్తోంది. బాల్య వివాహాలను నివారించడంలో కూడా ఈ సంస్థ విరామమెరుగని కృషి చేస్తోంది.

క్యాంపుల నిర్వహణ
ఇంట్లో చదువుకోవడానికి సరైన వసతులు లేని ప్రతిభగల పేద విద్యార్థులను గుర్తించి రెసిడెన్షియల్ క్యాంపులు నిర్వహిస్తూ వారి పురోగతికి పాటుపడుతోంది. వీరి కృషి ఫలితంగా దాదాపు 138మంది విద్యార్థులు ప్రతిష్ఠాత్మకమైన ఐఐఐటీకి ఎంపికయ్యారు. మరో రెండు వందల మందికి కార్పొరేట్ కాలేజీల్లో ఉచిత సీట్లు లభించాయి. వీటితో పాటు వాత్సల్య పూర్ణ పేరుతో అమ్మానాన్నలను కోల్పోయి అమ్మమ్మ, తాతయ్యల సంరక్షణలో ఉన్న బాలలను గుర్తించి వారికి దాతల సహాయంతో చదువుకోవడానికి, కనీస అవసరాలు తీర్చడానికి చేస్తున్న కృషి ప్రశంసనీయం.

చేయిచేయి కలిపి...
మనబడి, మన ఊరు, మన దేశం అనే నినాదంతో ఫౌండే షన్ అందిస్తున్న సేవలను చూసిన ఎంతోమంది రవీందర్‌తో చేతులు కలపి ఈ యజ్ఞంలో తమకూ భాగస్వామ్యం కల్పించమన్నారు. ఎంతోమంది ఉపాధ్యాయులు, ఇతరులూ ఈ సంస్థలో చురుగ్గా పాల్గొంటూ తమ చేతనైనంతలో సేవ చేస్తున్నారు.

దాతలు కూడా...
ప్రస్తుతం వరంగల్ జిల్లా తొర్రూరులో నిర్వహిస్తున్న క్యాంపు భవనాన్ని అమెరికాలో స్థిరపడిన డాక్టర్ అశోక్ రెడ్డి ఇచ్చారు. ఫౌండేషన్ కార్యక్రమాలకు సంతృప్తి చెందిన ఆయన ఆ భవనాన్ని ఫౌండేషన్ పేరిట రిజస్టర్ చేయిస్తానని చెప్పినా సున్నితంగా తిరస్కరించారు రవీందర్. ఆస్తులు పెరగడం వల్ల లక్ష్యాలు మారిపోతాయనేది ఆయన వాదన.

తులసీ గ్రూప్ కంపెనీకి చెందిన రామచంద్రప్రభు కూడా తన వంతు సాయాన్ని అందిస్తున్నారు. మరెంతోమంది విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాలు అందిస్తూ వస్తున్నారు. ఇదంతా తాను సాధిస్తున్న విజయం కాదని, అందరి సమష్టి కృషి ఫలితంగానే సంస్థ ఎటువంటి ఒడుదుడుకులు లేకుండా నడుస్తోందని వినయంగా చెబుతారు.

దేశభక్తే ప్రధానం..
వేల సంవత్సరాల క్రితం జరిగిన రామాయణ, మహాభారతాల్ని కథలుకథలుగా చెప్పుకుంటారు. కానీ కేవలం ఆరేడు దశాబ్దాల క్రితం జరిగిన స్వాతంత్య్ర పోరాటం గురించి, అప్పుడు వెల్లువెత్తిన దేశభక్తి గురించి ఒక్కరైనా చర్చించకపోవడమే తనను కలవరపెడుతోన్న అతి పెద్ద బాధంటారు రవీందర్. మన స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు కారకులైన వారిని జయంతి, వర్థంతుల రోజు గుర్తుచేసుకోవడం దారుణమంటారు.

అందుకే తమ క్యాంపుల్లో ఎక్కడ చూసినా సమరయోధుల చిత్రపటాలు ఏర్పాటు చేశారు. ఇవి నిరంతరం విద్యార్థుల్లో దేశభక్తిని రగిలిస్తాయి. ఈ మట్టిమీద పుట్టి, పెరిగి ఇక్కడి వనరులను అనుభవిస్తూ ఈ దే శం నాకేమిచ్చిందంటూ ప్రశ్నించడం మూర్ఖత్వం. దేశంకోసం ప్రాణాల్ని సైతం అలవోకగా త్యజించిన వారు నిత్యం క ళ్లముందు కదలాడుతుంటే విద్యార్థుల్లో కూడా ఆ విధమైన భావాలు మొలకెత్తుతాయంటారు.

ప్రస్తుతం వరంగల్, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకే పరిమితమైన సేవలను మరిన్ని జిల్లాలకు విస్తరించాలని ఉన్నా నిధుల కొరత ప్రతిబంధకంగా మారుతోందంటూ బాధపడతారు. కష్టనష్టాలకు వెరవకుండా అనుకున్న లక్ష్యం కోసం నిరంతరం కష్టపడుతున్న రవీందర్(9441901439)లాంటి వాళ్ల అవసరం దేశానికి చాలా అవసరం.
- కొత్తుర్తి గురులింగాచారి
Post a Comment

Popular posts from this blog

40 Days Residential Summer Camp for Govt. School Students at Aksharavanam, Kalwakurthy, Mahabubnagar Dist

Vandemataram Foundation Pratibha Awards 2016

Remebering BhagatSingh, Rajguru, Sukhdev on Balidan Divas / Martyrs Day 23rd March